7, మే 2018, సోమవారం

టైమ్ మానేజ్మెంట్ టెక్నీక్స్ - కాల నిర్వహణ పద్ధతులు -2 వ భాగము- SMART GOALS - మీరు విజేత - ఎలా మారాలి?


టైమ్ మానేజ్మెంట్ టెక్నీక్స్ -2వ భాగము 
కాల నిర్వహణ పద్ధతులు -2 వ భాగము 


మొదటి వ్యాసంలో కాల నిర్వహణ పద్ధతులు గురించి కొంత తెలుసుకున్నాము. ముఖ్యంగా, మన జీవితానికి సరైన ధ్యేయాలు యెంత అవసరమో కొంతవరకు చూశాము. ధ్యేయాలు లేని జీవితం సారహీనంగా, రసహీనంగా, అర్థహీనంగా వుంటుంది. 

ఉదయం నేను నిద్ర నుండి లేస్తే, కాలకృత్యాలు  తీర్చుకుని - ఆ తరువాత దినమంతా ఏం చెయ్యాలి - అన్న ప్రశ్న మీకు  వచ్చిందంటే - మీకు సరైన ధ్యేయాలు లేనట్టే కదా. 

ధ్యేయాలు - 
(1) నిర్దిష్టంగా,స్పష్టంగా ఉండాలి :- సర్వే జనాహ్ సుఖినోభవంతు - లాంటివి - ఆశయం కావచ్చు, ఆశ కావచ్చు, కానీ ధ్యేయం మాత్రం కాదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో - అదీ మీ ధ్యేయం. పది మందికి స్కూల్ ఫీజ్ కట్టడం , చదివించడం ఒక చిన్న ధ్యేయం. మీరే విద్యార్థి అయితే - 90 శాతం మించి మార్కులు పొందడం మీ ముఖ్యమైన ధ్యేయం కావచ్చు. స్కూల్ పుస్తకాలు దాటి మరేదైనా విద్య,కళ, సైన్స్, నేర్చుకోవడం మీ ధ్యేయం కావచ్చు. 
 
(2) ధ్యేయాలు గానీ, వాటి అమలు/ఆచరణ గానీ , కొలవగలిగే విధంగా , పోల్చి ఎక్కువ తక్కువలు, యెంత శాతం అన్నది నిర్ణయించగలిగే విధంగా ఉండాలి. ముందు చెప్పినట్టు, 90 శాతం మార్కులు, కోటి రూపాయాలు,100 మీటర్లు -5 నిముషాల్లో , యిలా కొలవగలిగే విధంగా ఉండేవి , ఆచరణ యెంత చేశామన్నది పోల్చి చూసుకునేది గా వుండేది ధ్యేయాలు గా వుండాలి. నేను మంచి వాడిగా వుంటాను - అన్నది కొలవగలిగే ధ్యేయం కాదు. రెండు మంచి పాటలు బాగా పాడడం నేర్చుకుంటా -పదిమందిలో పాడుతా - అన్నది మంచిదే, కొలవగలిగిందే , చిన్న ధ్యేయం . అయినా ఒక వారానికి సరిపోతుంది. 
 
(3) ధ్యేయాలు మనం తప్పక చెయ్యగలిగే విధంగానూ, సకారాత్మకంగానూ, నిర్మాణాత్మకంగానూ వుండాలి వుండాలి. నేను వారంలోపు పక్కింటి  వాడిని కొట్టి కాళ్ళు చేతులు విరిచేస్తాను - అనేది ఒక గోల్ కానే కాదు. మీకు, సమాజానికి ఉపయోగ పడే లాగా వుండాలి. నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతాను. ఎక్కండి. మీకేం లాభం. సమాజానికేం లాభం.కనీసం, యిది మీరు చెయ్యగలిగే ధ్యేయమా-ఏదైనా చూసుకోండి. మీ వూళ్ళో వున్న పెద్ద గుట్టను ఎక్కండి మొదట. గుట్టల నుండి, చిన్న కొండలు.ఆ తరువాత పెద్ద కొండలు. యిలా వెడుతోంది ధ్యేయాలను జయించే ప్రక్రియ. 4 చెట్లు పెంచుతాను. యిది సాకారాత్మకమైన, నిర్మాణాత్మకమైన గోల్.  
(4) మన ధ్యేయాలను ఆచరిస్తే, మనకు, మనం కోరుకునే వాళ్లకు ఏదైనా మంచి జరిగేలాగు ఉండాలి . ఇందాక చెప్పునట్టు - ప్రయోజన కారి గా ఉండాలి. నా ఆరోగ్యం, బలం బాగా పెంపొందించుకుంటాను. మంచిదే. కనీసం మీకైనా ఉపయోగపడే గోల్. ఏదో ఒక ప్రయోజనం ఉండాలి.
(5) ఒక్కొక్క ధ్యేయాన్నీ సక్రమంగా ముగించడానికి ఒక కాల పరిమితి  తప్పకుండా ఉండాలి. ఆ కాల పరిమితి ఎక్కువ,తక్కువ రెండూ కాక, సరైన పరిమితిగా ఉండాలి. సాధారణంగా ఏ ఒక్క ధ్యేయంగానీ, ఒక్క సంవత్సరపు గోల్, లేదా అంత కంటే తక్కువ కాలపరిమితిలో సాధించ గలిగేవిగా ఉంటే మంచిది. డిగ్రీల లాంటివి - వాటి కాలపరిమితి పై ఆధార పడి  వుంటుంది. 

ఇటువంటి ధ్యేయాల్ని (గోల్స్ ను) ఆంగ్లంలో స్మార్ట్ గోల్స్ అంటారు. స్పెసిఫిక్; మెజరబుల్; అఛీవబుల్ అండ్ పాజిటివ్; రివార్డింగ్ అండ్ రియలిస్టిక్; టైం బౌండ్  అని చెబుతారు. 

ఇటువంటి గోల్స్ మీరు ఎన్నుకోండి. మీకు ప్రతి రోజూ, ప్రతి వారమూ, ప్రతి నెలా, ప్రతి సంవత్సరమూ ఎంతో కొంత తృప్తి, సంతోషం కలుగుతాయి.

 ఒక రోజులో 24 గంటలు x 60 నిముషాలు x 60 సెకండ్లు = 86400 సెకండ్లు వున్నాయి. యిన్ని సెకండ్లలో ఎన్నో చెయ్యవచ్చు - మనం జాగ్రత్తగా వాడుకుంటే. 

లేదంటే - అన్ని సెకండ్లూ వేస్ట్ గా, ప్రయోజన హీనంగా కూడా గడిపెయ్య వచ్చు . యిలా వారంలో వున్న 7 రోజులలో, మీరు ఎన్ని రోజులు వ్యర్థంగా, ఎటువంటి అభివృద్ధి లేకుండా  గడిపేస్తున్నారో - కాస్త యోచన చెయ్యండి. 

మానవ జాతి చరిత్రలో - వున్నత మైన స్థితిని చేరుకున్న ప్రతి ఒక్కరు, తమ  సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారే. మీరు ఆనందంగా వుండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, పదవులు సంపాదించాలన్నా, బిరుదులు సంపాదించాలన్నా,   కీర్తిప్రతిష్టలు సంపాదించాలన్నా, పెద్ద చదువులు చదవాలన్నా, గొప్ప కళా కారులు కావాలన్నా, మంచి కుటుంబం సంపాదించాలన్నా, మంచి స్నేహితులను పొందాలన్నా , గొప్ప సమాజ సేవ చెయ్యాలన్నా, గొప్ప జ్ఞాని లేదా యోగి కావాలన్నా - మీ సమయాన్ని సద్వినియోగం చేసుకు తీరాలి. 

అందుకు - మీ ధ్యేయాలేమిటో మీకు తప్పక తెలియాలి. అవెప్పుడూ మీ ముందే వుండాలి. మీలోని అణువణువూ , మీ ధ్యేయాలపై కేంద్రీకృతం కావాలి . 

మీ ధ్యేయాలు, మీ లక్ష్యాలు , మీ గమ్యాలు - మీకు మార్గాలు . యివి మీ జీవితంలో అతి ప్రధానమైన అంశాలుగా ప్రతి రోజూ ఉండాలి. వాటిని గురించి ప్రతి రోజూ ఎంతో కొంత మీరు శ్రమించాలి. 

మీరు రోజువారీ చేసే పనులలో మీ లక్ష్యాలు లేకపోతే  - అవి మీ లక్ష్యాలెలా అవుతాయి ? అవి మీ గొంతెమ్మ కోరికలు గా మాత్రమే ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు - అయ్యో, నేను అవన్నీ చేసి ఉంటే ఎంత బాగుండేది - అని మీరు అసంతృప్తి పడతారు; నిరాశగా నిట్టూర్పు విడుస్తారు. మన దేశంలో నూటికి 80 మందికి పైగా ఇలాంటి వారే . మీరలా ఉండకండి. మీ జీవితంలో మీరు విజేత గా నిలవాలి . 

మీ  లక్ష్యాలు ఎప్పుడూ మీ ముందుంటే - 
 
1. మీరు టీవీ సీరియల్స్ చూడడం తనకు తానుగా తగ్గిపోతుంది 
2. ఉత్తుత్తి టెలిఫోన్ కాల్స్ మీరు చెయ్యరు . 
3. పేస్ బుక్ , వాట్సాప్ లాంటివన్నీ పక్కన బెడతారు. 
4. యీ మెయిల్స్ - ముఖ్యమైనవి మాత్రమే చూస్తారు, రిప్లై యిస్తారు 
5. ప్రొద్దు పోక పోవడం అన్న ప్రసక్తి ఉండదు మీకు. 
6. ప్రొద్దు చాలక పోవడం తరచుగా జరుగుతూ వుంటుంది.
7. మీలో, ఏదో, సాధిస్తున్నామన్న తృప్తి పెరుగుతూనే వుంటుంది. 
8. మీరు తరచుగా , ఏదో ఒకటి సాధిస్తూనే వుంటారు. ఏదో ఒక మెట్టు   ఎక్కుతూనే వుంటారు. 
9. నిద్ర తగ్గుతుంది. కళ్ళల్లో ఏదో మెరుపు పెరుగుతుంది. 
10. యింకా కాలేదే - అన్న అశాంతి ఒక్కో సారి రావచ్చు. అప్పుడు సాధించిన దాన్ని, సాధిస్తూ వున్న దాన్ని చూసి సంతోష పడండి. 
11. ఎప్పుడూ, సాకారాత్మకంగా, నిర్మాణాత్మకంగా, పాజిటివ్ గా , క్రియేటివ్ గా వుంటారు. 
12. మీ యిల్లు మారిపోతుంది. మీరు కూర్చున్న చోటు మారిపోతుంది. ఎన్నో మార్పులు వస్తాయి మీ యింట్లో. 
13. మీకూ, మీ భర్త/భార్యకు మధ్య సంబంధాలు బాగుపడతాయి. తాను మిమ్మల్ని  చూసి సంతోష పాడడం, గర్వ పడడం జరుగుతుంది. యిది కూడా మీ లక్ష్యాలలో ఒక భాగంగా ఉండాలి. 
14. మీరు ప్రతి రోజూ ఒక డ్యూటీ చార్ట్ వేసుకుంటారు. అది చేస్తున్నానా అని చూసుకుంటూ వుంటారు. 
15. ఏది ముందు, ఏది వెనుక అని సరి చూసుకుంటూ , ప్రతి లక్ష్యాన్నీ ముందుకు తీసుకుని వెడతారు. 
 16. లక్ష్యాలు కాని చెత్త పనులకు సారీ, అని చెప్పడం అలవాటు చేసుకుంటారు. 
17. ప్రతి లక్ష్యానికీ , యిప్పుడు కొత్తగా వస్తూ వున్న టెక్నాలజీ , ఎలా వుపయోగిస్తుందో తెలుసుకుని వుపయోగిస్తారు. 
18. వాయిదా వెయ్యడం, సోమరితనంగా ఉండడం మరిచిపోతారు . 
19. మీరు చేసే పనులన్నీ, మీకు ఆనందాన్ని యిచ్చేవిగా వుంటాయి. 
20. రోజు రోజుకూ మీలో అభివృద్ధి తెలుస్తూనే వుంటుంది. 
21.చిన్న,చిన్న ఆటంకాలను, అపజయాల్ని దాటి ముందుకు పోతూనే వుంటారు. 
చూసారా. పదేళ్ల తరువాత , మీ అభివృద్ధిని చూసి మీరే గర్వ పడే రోజు వచ్చేస్తుంది. 
మరి , యిది ఎప్పుడు ప్రారంభిస్తారు?
ఈ రోజే?
యిప్పుడే?
శుభం భూయాత్ . 

=మీ 
ఉప్పలధడియం విజయమోహన్
 

 



1 కామెంట్‌: