9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

తెలుగు ప్రముఖులు - వారిలో నాకు నచ్చిన వారు - 2 వ భాగము - చంద్రబాబునాయుడు గారు - బాబు గోగినేని గారు


తెలుగు ప్రముఖులు - వారిలో నాకు నచ్చిన వారు 


2 వ  భాగము 
చంద్రబాబునాయుడు గారు -బాబు గోగినేని గారు

తెలుగు వారిలో నాకు తెలిసి యిద్దరు బాబులు వున్నారు. బాబు గోగినేని ఒకరు. చంద్రబాబు (నారా) మరొకరు. యిద్దరికీ అసలు పోలికే లేదు. 

నారా చంద్రబాబు గారితో వాగ్వివాదాలకు దిగాలని కాచుక్కూర్చున్న వారు ఎంతో మంది వున్నా , ఆయన మీ ఆర్గ్యుమెంట్స్ నాకొద్దు, నాపని నాకు బోల్డంత వుంది - అని తన పని తాను  చేసుకుపోతున్నారు. 

గోదావరి, కృష్ణ నదులు ఇప్పటికే ఆయన కలిపేశారు. కృష్ణ నుండి నీటిని కుప్పం వరకు తీసుకురావాలని యిప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. అది ఆయన విజయవంతంగా పూర్తి చేయాలని ప్రతి ఆంధ్రుడు కోరుకుంటున్నారు. 

2019 వ సంవత్సరం ఈ రోజు కు కృష్ణ నుండి కుప్పం వరకు నీళ్లు రావాలి. రావచ్చు. అది జరిగిన నాడు  (నారా) చంద్ర బాబుగారు భారత దేశ చరిత్రలోనే, ఆంద్ర ప్రదేశ్ చరిత్ర లోనే - అపర భగీరథుడుగా మిగిలిపోతాడు. అలా జరగాలని నేను కూడా మనసారా కోరుకుంటున్నాను. 

ఆయన్ను గురించి మరెన్నో  చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి  కదా . ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న  నాయకుడు ఆయన. 

యింతకు ముందు మరో బాబును గురించి కూడా ముచ్చటగా ముచ్చ్చటించుకున్నాం. ఆయన బాబు గోగినేని. ఆయన మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చిన్న , చిన్న యుద్ధాలు చేస్తున్నాడు. నేను హేతువాదిని, హితవాదిని - అని చెప్పుకుంటాడు ఆయన. 

టి వి ఛానళ్లలో దర్సనాలిచ్చే జ్యోతిష్కులు, ప్రాణిక్ హీలేర్లు, వాస్తు శాస్త్రజ్ఞులు - ఇటువంటి వారు ఆయన గురిచూసి కొట్టే టార్గెట్లు. నేరుగా వెళ్లి, ఛానెల్  లోనే, అందరి ఎదురుగా, వారి గుట్టు రట్టు చెయ్యడం ఆయనకు ముచ్చట. దేవుడు లేడు -  అంటాడు. ఉంటే, నా ముందుకు తీసుకు రండి, చూపించండి - అంటాడు. చంద్రుడికేమిటి  గ్రహణం? సూర్యుడికేమిటి గ్రహణం? ఏదో కాస్సేపు వాళ్ళు నీడలో  కూర్చుంటే, యింత రాద్ధాంతాలా - అంటాడు. రాహువెక్కడ, కేతువెక్కడ - చూపించండి, అంటాడు. సూర్యుడు గ్రహం కాదు, నక్షత్రం - అంటాడు. జాతకాలన్నీ కట్టుకథలు, సైన్స్ కు దానికీ ఏ రకమైన సంబంధమూ లేదు - అంటూ కొట్టి పారేస్తాడు . 

అలాగే - వాస్తు శాస్త్రం ఎంత మూఢనమ్మకమో, దాన్ని గురించి మాట్లాడుతాడు. కానీ, నమ్మే వాళ్ళు నమ్ముతూ ఉంటే, భయపడే వాళ్ళు భయపడుతూ వుంటే, నమ్మని వాళ్ళు నమ్మకుండా ఉంటే వాళ్ళ వాళ్ళ జీవితాలు అలా సాగిపోతూ వున్నాయి. 


బాబు గోగినేని గారి యింట్లో మూడు తరాలుగా, యిదే  భాగవతం కొనసాగుతోంది. వారి తండ్రి, తల్లి, తాత, అవ్వ, భార్య, కొడుకు - అందరూ దాదాపు ఒక్క లాగే - అంటాడు ఆయన. ఎవరికీ వీటి పైన నమ్మకాలు లేవట. లేకుండొచ్చు. కాబట్టి, ఆయన జీన్స్ లోనే దేవుడు,  దయ్యము, మరి యే యితర నమ్మకాలు లేక పోవచ్చు. 

నాకేమో ఆయన్ను, ఆయన భార్యను చూస్తే కొంత జాలేస్తుంది. కొంత ఆనందం. ఆయన కొడుకును చూస్తే కూడా. జీన్స్ తో బాటే  యిన్ని అపనమ్మకాలు వచ్చేశాయి. ఆయనేం చెయ్యలేడు ఈ విషయంలో. మనకు వచ్చే  నమ్మకాల లాగే, ఆయనకూ ఈ అపనమ్మకాలు వంశ పారంపర్యంగా వచ్చినట్టున్నాయి. మన నమ్మకాలు మనవి. ఆయన నమ్మకాలు ఆయనవి. ఆయనకు  నచ్చని ఇలాంటి చాలా విషయాలు నాకూ నచ్చవు. 

కాకుంటే - టి వి ఛానెళ్లలో వచ్చే జ్యోతిష్కులు, వాస్తు వాళ్ళు, పామిస్ట్రీ వాళ్ళు, ప్రాణికి హీలేర్స్, క్రిస్టియన్ హీలేర్స్ లాంటి వాళ్ళను చూసినప్పుడల్లా - నేను టి వి ఆఫ్ చేసేస్తాను. వాళ్ళతో కొట్లాటకు వెళ్లేంత ఓపిక నాకు  లేదు. గోగినేను   గారు పుట్టక ముందు నుండి నాకు అటువంటి వారిపై  పెద్దగా మంచి అభిప్రాయం లేదు. కానీ, వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. కొంత మంది ఆ నమ్మకాలను వ్యాపారంగా వాడుకుంటున్నారు.  వారిపై, గోగినేని చిన్న చిన్న యుద్ధాలు చేస్తుంటారు. నాకంత ఓపిక లేదు. 


నేను 40-45 సంవత్సరాలకు ముందు (1975-78 మధ్యలో ఎప్పుడో) కోల్కత్తా  లో వుండే సమయంలో కీరో గారి పామిస్ట్రీ పుస్తకం  కొని చాలా సార్లు చదివాను. నేను అది చదవడం చూసి  నాకు తెలిసిన వారు, తెలియని వారు చాలామంది తమ చేతులు నాకు చూపటం, నేను వారి  చేతులలో రేఖలను పరిశీలించడం జరిగింది. అందులో ఒక 20 శాతం కరెక్ట్  గా ఉండొచ్చునేమో అని అప్పట్లో నాకు అనిపించేది. తరువాత హస్త రేఖలు చూడడం మానేశాను. ఈ రేఖలు, శంఖాలు, చక్రాలు అందరికీ వేరు వేరు గా వుండటం విశేషం.  బొటన వ్రేలి కొన లో వున్న రేఖలైతే  - ప్రపంచంలో ఏ ఇద్దరివీ వొకటిగావుండవు - అని అందరి నమ్మకం. సైంటిస్టుల నమ్మకం కూడా.  ఎందుకు అలా వుందో - పైనున్న  లేదా పైన లేని భగవంతుడికే తెలియాలి. మీ దస్తూరీ ఎవడైనా చెయ్యొచ్చు . మీ బొటనవ్రేలి రేఖలు  ఎవ్వడూ చెయ్యలేడు. అలాగే. కాలక్రమంలో మీ దస్తూరీ మారుతుంది. కానీ, బొటనవేలి రేఖలు అమ్మ కడుపులో నుండి, లేదా,  కనీసం పుట్టినప్పటి నుండి , కాటికెళ్లే దాకా మారవు అని అందరికీ నమ్మకం. 

ఆధార్ కార్డుకు యిదే ఆధారం. 

మీ లాంటి వ్యక్తి మరొకరు ఉండొచ్చు. మీరు భయపడకండి. ఒక ఉదాహరణకు,  రావణుడు రాముడు లాగా మారు వేషం వేసుకుని సీతమ్మ దగ్గరికి పోవచ్చు. నీ బొటన వ్రేలి రేఖలు  వేసి చూపించు అని సీతమ్మ అంటే మాత్రం  దొరికిపోతాడు.  జీన్స్ టెస్టింగ్ చెయ్యనక్కర లేదు. 

ఇక జ్యోతిష్యం కూడా కొంతలో కొంత కరెక్ట్ గా ఉండొచ్చునెమో  - అని నా అనుమానం, నా అభిప్రాయం. మనిషే అస్సలు తెలియకుండా - కేవలం పుట్టిన రోజు, నక్షత్రం, పుట్టిన సమయం చూసి - వాళ్ళ జీవితాలలో జరిగిన, జరుగుతున్న, జరగబోయే కొన్ని సంఘటనలు కొంత మంది జ్యోతిష్కులు - సరిగ్గా చెప్పగలగడం నేను చాలా సార్లు చూసాను . 

అందు వలన, జ్యోతిష్యం కూడా పూర్తిగా కొట్టి పారవేయ తగిన విషయం గా నేను అనుకోవడం లేదు. శాస్త్రులు తప్పుగావచ్చు. శాస్త్రం తప్పు గాకపోవచ్చు. యివన్నీ ఎలా వచ్చాయో మనకైతే తెలీదు. ఎప్పుడు వచ్చాయో తెలీదు. పూర్తిగా కొట్టి పడేసే ముందు, కనీసం స్టాటిస్టికల్  పద్ధతుల ప్రకారం కొంత చూసుకుంటే   తెలీని నిజాలు, అబద్ధాలు కొన్ని తెలిసే అవకాశం వుంది కదా అంటాను . 

పూర్తిగా, గుడ్డిగా నమ్మడం ఎంత తప్పో , పూర్తిగా, గుడ్డిగా కొట్టి పారేయడం కూడా అంతే తప్పు అని నా అభిప్రాయం. శాస్త్రీయ దృక్పథం వుండాలి - రెండింటికీ అన్నది నా అభిప్రాయం .

మన జీవితాల్లో - మన ప్రమేయం లేకుండా ఎన్నో విషయాలు జరిగిపోతున్నాయి. అన్నీ మనమే నిర్ణయించడం లేదు. మన గుండె తల్లి కడుపులో వున్నప్పటి నుండి, 100 సంవత్సరాలు ఒక పద్ధతి ప్రకారం కొట్టుకోవడం జరుగుతూ వుంది - కానీ అది మనం చెయ్యడం లేదు కదా.  ఎవరు చేస్తున్నారో మనకు తెలీదు. 

కోట్ల కొద్దీ మగ జన్యు కణాలు లేదా స్పెర్మ్స్,  ఆడ అండం వైపుకు దూసుకు పోవడం, అందులో వొక్కటికే గుడ్డులోకి ప్రవేశం లభించడం  నుండి, మనం చచ్చే వరకు మన జీవితాల్లో జరిగేవన్నీ మనకు అద్భుతాలే. అందులో 99.99  శాతం, మన  జీవితాల్లో అవి తమకు తాముగా జరుగుతున్నాయి, కానీ, మనం చెయ్యడం లేదు.  

మన చర్మం పై పొర క్రింద నుండి , అంటే రెండో పొరనుండి,  మన లోపల ఏముందో మనం ఎప్పుడూ చూడ లేదు, తాక లేదు, చూడదలుచుకోలేదు, తాక దలుచుకోలేదు కూడా.  లోపల జరిగే అన్ని ప్రక్రియలకు, మనకు అస్సలు సంబంధమే లేదు. నోట్లో పెట్టుకుంటాం, మింగుతాం. ఆ తరువాత లోపల జరిగే వాటికి మనకు సంబంధమే లేదు.  కళ్ళు చూస్తాయి, ముక్కు వాసన చూస్తుంది. చెవ్వు వింటుంది. యివి ఏదీ ఎలా నిజంగా పనిచేస్తున్నాయో కూడా మనకు తెలీదు. 

మనం - మనుషులుగా , అందులో మగ, లేదా, ఆడగా పుట్టడంలో మన ప్రమేయం యెంత? అస్సలు లేదు. 15,16 ఏళ్ళయితే ఏదో హార్మోన్లు పని చెయ్యడం, ఏదో ఎమోషన్లు, ఏదో ఆటలు,  ఆ ఆటల తర్వాత  ఎప్పుడో  శరీరం పడిపోవడం - వీటిలో ఏదీ, మన యిష్ట ప్రకారం అయితే జరగడం లేదు గా .  

యివన్నీ సైన్స్ ప్రకారం జరుగుతున్నది అన్నది అర్థం లేని వాదన. జరుగుతున్న దానికి సైన్స్ ఒక రకమైన, పాక్షికమైన అర్థం చెబుతుంది.అంతే. అది తప్పు లేదు. వీటన్నిటి వెనుక మరో గొప్ప శక్తీ ఉండొచ్చు; ఆ శక్తికి మనకంటే  యెంతో యెక్కువగా యోచన చేసే, సృష్టి చేసే, పెంచే, లయింపజేసే  శక్తీ వుండొచ్చు - అనుకుని ,దాన్ని గురించి అపారమైన పరిశోధనలు చేసిన మన ఋషులు శాస్త్రజ్ఞులు కాదనుకోవడం, వారికి సైంటిఫిక్  దృక్పథం  లేదనుకోవడం  మాత్రం మూర్ఖత్వం క్రిందకే వస్తుంది. 

భూమిపైనున్న మనుషులు, మిగతా జీవరాసులు  అన్నీ భూమిలోని, భూమి చుట్టూ వున్న శక్తినీ,  పదార్థాలన్నీ గ్రహించే పుట్టుతున్నాయనీ, పెరుగుతున్నాయనీ, ఏదో ఒక క్రమానుసారంగా మరణిస్తూ, మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతున్నాయనీ -  యివన్నీ మనం చూస్తూ వున్న సత్యమే కదా. 

యిన్ని కోట్ల,కోట్ల ప్రాణులకు, మనకు కూడా - జీవాన్నిచ్చే,పెంచే,చంపే - పూర్తి ఆధారభూతమైన, భూమికి మనకంటే ఎక్కువ ప్రాణము, మన కంటే  ఎక్కువ జ్ఞానము  లేవు, దానికి జీవమే లేదు - అనుకోవడం ఎంత మూర్ఖత్వం. మనకు పుట్టుకనిచ్చే భూమికి ప్రాణం లేదు. మనకు వుంది. మనకు జ్ఞానం యిచ్చే భూమికి జ్ఞానం లేదు. మనకు వుంది . యిది సైంటిఫిక్ దృక్పథమా? కానే కాదు. మనలో వున్న తెల్ల కణాలు, ఎర్రకణాల గురించి మనకు తెలీదు. మనం  పెరుగుతున్న భూమి గురించీ మనకు తెలీదు. సూర్యుడి కిరణాల ఆధారంగా భూమి పైన బ్రతుకున్న జీవ రాశి  గురించి కూడా మనకు అవగాహన లేదు. 

అసలు భూమి  సూర్యుని చుట్టూ ఎందుకు తిరగాలి. మన పూర్వీకులు రివెర్స్ గా సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని  అర్థం చేసుకున్నారనుకుందాం.  కావచ్చు.  కానీ ఈ రోజుకూ, మన  కళ్ళకు కనిపించే సత్యం అదే కదా. అలాగే, చంద్రుడు కూడా. తమ కళ్ళకు కనిపించే  విషయాలను , ఎంత తార్కికంగా వాళ్ళు చూడగలిగారో. అంత తార్కికంగా అర్థం చేసుకున్నారు . అంతే. అప్పటికి అది సరైన సైంటిఫిక్ దృక్పథమే. 

ఖగోళంలో వున్న సకల చరాచరాలను వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి, తమకు అర్థమైనవి అర్థమైనట్టు రాసుకున్నారు. వాళ్ళు ఋషులు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పదలుచుకోలేదు. తమకు అర్థమైంది చెప్పారు. తమకు అర్థం కానివి చెప్పలేదు. 

వాటిలో, కొన్ని తప్పు  అని ఈ రోజు మనం చెప్పొచ్చు . అంటే - సైన్స్ అప్పటి కంటే , యిప్పుడు అభివృద్ధి చెందింది - అని మనం చెప్పుకోవచ్చు ; అంతే కానీ, మన రుషులకు  శాస్త్రీయ దృక్పథం లేదనుకోవడం - చాలా తప్పు. 

 నా అభిప్రాయంలో - భూమికీ అపరిమితమైన జ్ఞానము,  ప్రాణము వుంది. అలాగే - ప్రతి గ్రహానికి, నక్షత్రానికీ,  ఉప గ్రహానికి అపరిమితమైన జ్ఞానము, ప్రాణము వుంది. వాటి చలనము, వాటి సంబంధాలు, బాంధవ్యాలు  మనకు ఏమీ అర్థం కాలేదు, యింత వరకు -అన్నది మనం గుర్తుంచుకోవాలి.  సూర్య చంద్రులు లేకపోతే, భూమి పైన ప్రాణికోటి, మానవ సమాజము అస్సలు ఉండదేమో కదా. 

మనలో వున్న తెల్ల, యెర్ర కణాలకు మనం ఎలాగైతే అర్థం కామో, కాలేమో అలాగే, భూమి, సూర్యుడు, చంద్రుడు గురించి మనకేమీ పెద్దగా అర్థం కాలేదనేది   మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. 

ఒక్క సారి - వాటికున్న జ్ఞానము, ప్రాణము, మనతో  పోలిస్తే అపారం అని మనం అర్థం చేసుకుంటే, కనీసం అనుకుంటే, వాటినే గురువులుగా అనుకుని, వాటి  వద్ద, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే -మనలో వున్న అజ్ఞానము , అహం కొంత వరకు తొలిగిపోతుంది. 

జ్యోతిష్యం , వాస్తు - లాంటివి ముఖ్యం కాదు. మీ పుట్టుకకు ముందు, మీ మరణం తర్వాత , మీ అస్తిత్వం ఏమైనా వుందా - అన్నది మీకు ముఖ్యం . అదే వేదాంతం . అదే యోగ . అదే జ్ఞానం . 

దాన్ని  వెదుక్కుని మీరు వెళ్ళాలి కానీ, అది మిమ్మల్ని వెదుక్కుంటూ రాదు. మిమ్మల్ని గురించిన సత్య శోధన వాదనల ద్వారా ఎప్పటికీ తెల్లారదు.    మీరు దాన్ని వెదుక్కుంటూ వెళ్ళాలి. ఎక్కడికి ? మీ లోపలికి. మీలోలోపలికి. నిజమైన మీరు, మీకు  అక్కడ  దర్శనమిస్తారు. ఆ ప్రయాణం మీదే.  మీరే చెయ్యాలి. మీరు ఎవరితో ఎన్ని వాదనలు చేసినా, మీరెవరో, మీకు ఎప్పటికీ తెలీదు.  

యోగ - అనేది ఒక మార్గం. జ్ఞానం అనేది మరొక మార్గం. రెండో దానికి గొప్ప గురువు చాలా అవసరం.  సంవత్సరాలు గడిచిపోతాయి. 

యోగ మార్గంలో - ఒక్కొక్క 3 నెలలకూ , ఎంతో కొంత మీరు ముందుకు పోయినట్టు , మీకే తెలిసిపోతుంది.  గమ్యం ఎప్పుడైనా దగ్గరికి రావచ్చు . ఎప్పుడు? తెలీదు. సంవత్సరాలు పట్టొచ్చు. వున్నట్టుండి  తెలిసి పోవచ్చు. కానీ, మీరు ముందుకు  పోతూ ఉన్నట్టు మీకు తెలుస్తూనే వుంటుంది  యోగ మార్గంలో .  

నిజంగా, మిమ్మల్ని గురించిన నిజం మీకు తెలియాలని - అనుకునే వారంతా , యోగ మార్గం అనుసరించండి. ఇందులో మీరు ఏ విధంగానూ మోస పోరు. నిరాశ చెందరు. మీ,మీ ప్రయత్నాలకు అనుగుణంగా , మీకు అప్పుడప్పుడూ ఏదో ఒక నిజం తెలుస్తూనే వుంటుంది. మిమ్మల్ని  ఆశ్చర్య పరుస్తూనే వుంటుంది. 

అది కష్టం . అంతకంటే, హేతువాదులుగా, హిత వాదులుగా ఉండటం సులభం గనుక అలా వుండాలనుకుంటే  - టి వి ఛానెళ్లలో మీ వాదనలు, కొట్లాటలు, ఓడించడాలు, ఓడిపోవడాలు కొన సాగించండి . అది తప్పని నేననటం లేదు. అదీ సమాజానికి కావలసిందే . 

నేనిక్కడ రాస్తున్నది - తెలుగు ప్రముఖులు - వారిలో నాకు నచ్చిన వారు  గురించి.  బాబు గోగినేని కూడా నాకు నచ్చారు. ఈయన మూఢ నమ్మకాలకు ప్రతిరోధంగా మాట్లాడుతున్నారు, కొట్లాడుతున్నారు. అది మంచిదే. అదే సమయంలో. మనదేశంలో మొదటి నుండి వున్న ముఖ్యమైన శాస్త్రాల  గురించి   తెలుసుకోకుండా వుండటం, అవన్నీ కూడా నాకు తెలియదు  కాబట్టి   అవి సైన్స్ కాదు అనుకోవడం తప్పు అన్నది నా అభిప్రాయం. మన దేశంలో ఉన్నటువంటి తర్క శాస్త్రం  ఎంతో పురాతనమైనది, పటిష్టమైనది. చాలా ముఖ్యమైన విషయాలన్నిటిలోనూ , సునిశితమైన తర్కం ఎంతో ఎక్కువగా వాడబడింది. ఆ విషయం బాబు గోగినేని గారికి తెలీక పోవచ్చు. 

అవన్నీ ఒక్క సారి చూడాలి. అప్పుడు మన దేశంలోని పురాతన సైన్స్  పైన   గౌరవం తనంత తానుగా వస్తుంది. 

మన భగవద్ గీత  మత గ్రంధం కానే  కాదు. అది మానవ జాతికి లభించిన మొట్టమొదటి మానసిక తత్వ శాస్త్రం. మోటివేషనల్ సైన్స్ టెక్ట్  బుక్. 

అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అంటే,   యుద్ధం చెయ్యక పోవడం ఎలా తప్పు, చెయ్యడం ఎలా  కరెక్ట్  అని రకరకాలుగా విజ్ఞాన శాస్త్ర రీత్యా , మనో తత్వ శాస్త్ర రీత్యా  చెప్ప బడిన పుస్తకం. కానీ, యిప్పుడు భగవద్ గీత ను చాలా మంది చావు యిళ్ళల్లో , ఏదో  నిర్వేదంగా, దుఃఖంగా  ఉండాల్సిన సమయం అన్నట్టుగా వాడుతున్నారు. ధర్మానికోసం కొట్లాడండిరా  మూర్ఖులారా, అని అంటే, మేము చేతులు కట్టుకుని గీత మొదట్లో వున్న అర్జునుని లాగే కూర్చుంటాం-  అంటున్నాం మనం.

సమస్య ఏమిటంటే - శ్రీకృష్ణుడు కర్మ యోగి. ఏది ఎప్పుడు చెయ్యాలో అది అప్పుడు చెయ్యాలి , నీ భవిష్యత్తుకు నువ్వే సృష్టికర్త కావాలి - అనే వాడు. 

కానీ, యిప్పుడు గీతను చదివే వాళ్ళు అలా లేదు. ఒకటా సోమరులుగా వున్నారు. లేదా,  అన్నిటికీ  నువ్వే దిక్కు  దేవుడా - అనే వారుగా వున్నారు.  గీతను చదివే వాడు తన భవిష్యత్తును తానే మలుచుకునే వాడుగా ఉండాలి, ధర్మానికోసం పోరాడేవాడు గా ఉండాలి తప్ప, సోమరిగా, నిస్సత్తువగా ఉండకూడదు . 

ఆ  విధంగా చూసే, బాబు గోగినేని గారిని నేను అభినందిస్తున్నాను. కానీ, మన దేశంలోని సైన్స్ ను మరో కోణం నుండి చూడమంటున్నాను. 

నేను యోగ శాస్త్రాన్ని గురించి 760 పేజీల ఆంగ్ల పుస్తకం  రాసాను . దాని పేరు "COMPREHENSIVE  TREATISE  ON  PATANJALI YOGASUTRAS." అది యిప్పుడు  E-book గా AMAZON.IN లో కొనుగోలుకు వుంది. మీరు కావాలంటే చదవొచ్చు. కొంత కష్టపడాలి. 760 పేజీల పుస్తకం కదా. టి.వి. చానెళ్లలో వాదించడం కన్న కొంత కష్టం .

చంద్రబాబు గారికి, బాబు గోగినేని గారికి - నా అభినందనలు . 

=మీ 

ఉప్పలదడియం విజయమోహన్   

 
  

5, ఫిబ్రవరి 2018, సోమవారం

తెలుగు ప్రముఖులు - వారిలో నాకు నచ్చిన వారు

తెలుగు ప్రముఖులు

వారిలో నాకు నచ్చిన వారు


తెలుగు వాళ్లలో నాకు నచ్చిన వాళ్ళు చాలా మంది వున్నారు.

ముఖ్యులైన మన ప్రవచన కర్తలందరూ నాకు బాగా నచ్చారు. శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వంటి ప్రముఖులు మాత్రమే కాకుండా యింకా  ఎంతో  మంది  చాలా బాగా ప్రవచనాలు చెప్పే వాళ్ళు తెలుగు నాట వున్నారు. 

చాగంటి గారి వాక్చతురత, వారి మేథాపాటవము, ఎప్పటికెయ్యది ప్రస్తుతమో,అప్పటికా మాటలాడ గలిగే నైపుణ్యము, అన్నిటినీ మించిన వారి వినమ్రత మనకు (నాకు) బాగా నచ్చుతాయి. గరికపాటి వారి సులభ శైలి, ప్రస్తుత పరిస్థితులకు కావలసింది చెప్పడం, వారి అవధాన చాతుర్యం ఎంతో బాగుంటాయి. షణ్ముఖ శర్మ గారిలో వీరిద్దరి పోలికలూ వున్నాయి. మహా మేధావులైన వీరందరూ కలిసి ఒకే  త్రాటిపై నడిచే విధంగా వుంటే   యింకా, యింకా యెంతో బాగుంటుందనే అభిప్రాయం, అభ్యర్థన కూడా నేను కొన్ని టి వి ఛానళ్లలో విన్నాను. దాన్ని నేనూ సమర్థిస్తున్నాను. ఎటువంటి అభిప్రాయ భేదమైనా సుహృద్భావముతో, ముఖాముఖీ సరిచేసుకోవచ్చు. 

అంతే కాదు. వీరు  ముగ్గురు, నలుగురు కలిసి, గొలుసుకట్టు రచన లాగా - కృత, త్రేతా, ద్వాపర, కలి  యుగాలను   కలుపుతూ - ఏదైనా గొప్ప గ్రంధం రచిస్తే , అది ఒక ప్రామాణిక గ్రంధం గానూ ఉంటుంది. చారిత్రిక గ్రంధం లాగూ ఉంటుంది. భారత  దేశానికి   ఆంగ్ల వాసన లేకుండా వచ్చిన ఒక ఆదర్శ గ్రంధంగానూ ఉంటుంది. ఎన్నో సందేహాలు , అపోహలు తీర్చే గ్రంధం గానూ , హైందవ సంస్కృతి యొక్క గొప్ప చరిత్ర గానూ వుంటుంది. 

దీనికి వచన రచనే చాలు. రెండేళ్లు సమయం తీసుకోవచ్చు వీరు చేస్తే అందులో తప్పులు దొర్లవు. వున్నా సరిచేసుకునే వీలు తప్పక ఉంటుంది. దేశానికంతా ఒక ప్రామాణిక గ్రంధంగా వారి రచన మిగిలిపోతుంది. యింత ప్రతిభావంతులు, తమ కొద్దిపాటి అహం ప్రక్కన పెట్టి కలిసి పనిచేస్తే, తమ గొలుసుకట్టు రచన ద్వారా - ప్రపంచానికే  మార్గ దర్శకమైన గొప్ప రచన చెయ్యగలరనడంలో నాకు సందేహం లేదు. తెలుగు నాట యింతకు ముందు మహాభారతం ఆంధ్రీకరించిన కవిత్రయం ను మించిపోగలిగిన రచన వీరు చేయగలరని నా నమ్మకం. నా ఆశ.  ఆ తరువాత వారి రచనను -  మిగతా భాషలలోకి సులభంగా అనువదించుకోవచ్చు. నాకు తెలిసి మిగతా భాషలలో ఈ పని చెయ్యగలిగిన యింతటి ప్రతిభావంతులు యిప్పుడు లేరనే చెప్పవచ్చు. వీరి తరువాత యింత పండితులు, ప్రతిభావంతులు వస్తారా - అంటే , చెప్పడం చాలా కష్టం. రావాలంటే , వీరే పూనుకోవాలి. 

రాజకీయాలలో కొట్లాటలు సహజం. అక్కడ కూడా సుహృద్భావముతో ఉంటే, చాలా  అందంగా వుంటుంది. అక్కడ కూడా అక్కర్లేని బురద చల్లడమే పనిగా పెట్టుకో రాదు. కానీ , శాస్త్రాలను బోధించే ప్రవచన కర్తల మధ్య మచ్చ  లేని స్నేహ భావం మాత్రమే ఉండాలి. ఉంటే , యింతటి  మహత్తరమైన కార్యం సాధించే  అవకాశం, వీలు తామే వెదుక్కుంటూ వస్తాయి. 

సరే. వీళ్ళు కాకుండా, అష్టావధానాలు చేసే వాళ్ళు, శతావధానాలు చేసే వాళ్ళు, సహస్రావధానాలు చేసే వాళ్ళు ఎంతో మంది వున్నారు.అందరూ మహానుభావులే.  అందరికీ వందనాలు. వారందరూ నాకు నచ్చిన వాళ్ళే. వీళ్ళు కూడా తమ అసమాన ప్రతిభతో మరేదైనా కొత్త ప్రయోగాలు చెయ్యొచ్చు. మా తాతలు చేసిందే నేనూ చేస్తాననడం - అది ఎంత గొప్ప పనైనా - పెద్దగా శోభించదు. మీరే యోచన చేసి చూడండి. వీరు చేస్తున్న పని చాలా కష్టభరితమైనది.అసమాన ప్రజ్ఞ కావాల్సిన పని అది. కానీ, ఎంత  ప్రజాదరణ  వుంది ఈ  కష్ట భరితమైన, అసమాన ప్రజ్ఞ తో కూడిన పనికి. వెయ్యి మంది వస్తారా చూడ్డానికి, వినడానికి.  ఎంతో బాగున్న, ఒక శతావధానానికి వంద మంది  లేరు వినడానికి. కానీ, ఈ ప్రక్రియను మరో రకంగా చేస్తే -  ఈ ప్రతిభను లక్షల మందికి పంచవచ్చునేమో - అనిపిస్తుంది. అలా  జరిగితే , దేశం ఎంతగానో  మారిపోతుంది. ఈ మహానుభావులు ఈ విషయాన్ని యింకా బాగా యోచన చెయ్యాలని  నా ప్రార్థన , అభ్యర్థన. 

సరే. సన్యాసం స్వీకరించి, సామాజిక పరిస్థితులను చక్కదిద్దే పని కూడా చేసే  స్వామీ పరిపూర్ణానంద వంటి వారు కూడా నాకు బాగా నచ్చారు. రామకృష్ణ మిషన్ స్వామీజీలు కూడా  ఎంతో మంది  ఎన్నో రకాల సమాజ సేవ చేస్తున్నారు. వారిని గురించి ప్రచార మాధ్యమాలలో యింకా  రావాలి. మనకు వారి కృషి, గొప్పతనం తెలియక పోతే , మనకే చాలా  నష్టం అనిపిస్తుంది. 

పై వారందరిలో, నాకు చాలా, చాలా, ఎక్కువగా నచ్చిన గుణం వారి నిజాయితీ. నచ్చిన మిగతా గుణాలు వంద.  నచ్చనివి ఒకటో రెండో వుండొచ్చు. వాళ్ళు యిది చెయ్యాలి, అది చెయ్యాలి, అని నా మనసులో - వారి పట్ల కొన్ని ఆశలు, ఆపేక్షలు ఉండొచ్చు. వున్నాయి . వారు అందరూ అవి అన్నీ చెయ్యలేక  పోవచ్చు. లేదా చెయ్యక పోవచ్చు.

అందరూ అన్నీ చెయ్యాలని, చెయ్యగలగాలనీ దేవుడి సృష్టిలో ఎక్కడా లేదు. వాళ్ళు చేస్తున్నదే చాలా గొప్ప - అన్న సత్యం నేను మరచిపోకూడదు. నా అసలు ప్రశ్న -వాళ్ళు ఎందుకు ఇదో అదో చేయడం లేదన్నది కాదు, అవి నేనెందుకు చెయ్యడం లేదు - అన్నదే కావాలి.ఆ ప్రశ్న  నాలో రావాలి.  మనందరిలో రావాలి. అప్పుడు మనం అందరూ ఎన్నో కొత్త ప్రయోగాలు తప్పక చేస్తాం . 

ప్రముఖ తెలుగు రచయితలు, వక్తలు లాంటి వారు ఎంతో మంది నాకు నచ్చిన వాళ్ళు వున్నారు. శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు, శ్రీ  బి.వి. పట్టాభిరామ్ గారు, శ్రీ గంపా నాగేశ్వర రావు గారు - ఇలాగా ప్రముఖ రచయితలు, వక్తలు అందరూ నాకు నచ్చిన వాళ్ళే. ముఖ్యంగా వీరు ముగ్గుర్నీ - నేను హైదరాబాద్ లో నేషనల్ అకాడెమి  అఫ్ టెలికాం ఫైనాన్స్ అండ్ మానేజ్మెంట్ లో డీజీఎం గా పని చేస్తున్న రోజుల్లో -  ప్రతి వారం మేము పనిగట్టుకుని పిలిచి స్వాగతించే వాళ్ళము. దేశంలోని ప్రతి రాష్ట్రం నుండి మా అకాడెమీ కి వచ్చిన అధికారులకు (ట్రెయినీలకు) మన ప్రముఖులైన వీరి చేత చాలా అందమైన వుపన్యాసాలు ఇప్పించే వాళ్ళము. వీరందరి వుపన్యాసాలు , మా లెక్చర్ హాళ్లలో , చాలా సార్లు నేను విన్నాను. 

ఇప్పుడూ - వారు ఇంపాక్ట్  ఫౌండేషన్ ద్వారా ఇస్తున్న ఉపన్యాసాలు  వింటూ వుంటాను. అప్పట్లో ఇంపాక్ట్ ఫౌండేషన్ లేదనుకుంటా. ఆ తరువాత ఇంపాక్ట్ ద్వారా వారు చేస్తున్న సమాజ  సేవ చాలా గొప్పది. - అని నా నమ్మకం . ఉపన్యాసాలే కాకుండా,  యితర విధాలుగా కూడా వాళ్ళందరూ సమాజ సేవ చేస్తున్న వాళ్ళే.

వీరు కాక - సంగీతము , సినిమా,  రంగాల్లో తెలుగు ప్రముఖులు ఎంతో మంది వున్నారు. టెక్నాలజీ రంగంలో సత్యా నాదెళ్ల లాంటి వారు యెంతో మంది. క్రీడారంగంలో ప్రముఖ తెలుగు క్రీడాకారులు, క్రీడాకారిణులు ఎంతో మంది. యిలా ప్రతి  రంగం లోనూ  రాణిస్తూ వున్న వారు ఎంతో మంది వున్నారు. 

బాహుబలి లాంటి సినిమా -  మళ్ళీ ఎప్పుడైనా వస్తుందా ? యింతకు ముందు లేదు . ఇకపై  వస్తే  రాజమౌళి ద్వారానే రావాలి, తెలుగు లోనే మళ్ళీ రావాలి - అన్నట్టుగా వుంది. ఇలాంటి అపూర్వ సృష్టిఖండాలు - ప్రతి రంగంలోనూ , తెలుగు నాట మళ్ళీ , మళ్ళీ రావాలని మనం  అనుకోవడం లేదా?  ఆశించడం లేదా ?

వీరు కాక - ఈ మధ్య కాలంలో నేను విన్న ఒక  పేరు  'బాబు గోగినేని'. ఈయన స్వంతంగా ఏ పనీ చేసినట్టు లేదు. కానీ , తప్పుచేసేవారిని,అబద్ధాలతో మోసం చేసేవారిని పట్టుకుని ప్రజల ముందు నిలదీస్తున్నారు. తన్ను తాను - హేతు వాది, హిత వాది - అని పరిచయం చేసుకుంటారు. మీకందరికీ ఆయన బాగా తెలిసే వుండొచ్చు. నాకొక 15 రోజులకు ముందే ఆయన గురించి తెలిసొచ్చింది.

యూట్యూబ్ లో ఆయన వీడియోలు  చాలా చూశాను. ఆయన అభిప్రాయాలు, భావాలు అన్నీ కాదు కానీ, చాలా - నాకూ నచ్చాయి. ఆయన చాలా వరకూ హేతు వాది, హిత వాది -  అని నేనూ వొప్పుకుంటాను. దేవుడు లేడు - అంటాడు. జాతకాలు తప్పు అంటాడు. ఆస్ట్రాలజీ, వాస్తు శాస్త్రం, పామిస్ట్రీ, న్యూమరాలజీ లాంటివన్నీ హేతుబద్ధమైనవి కావనీ, నమ్మొద్దనీ అంటాడు.వాటి ద్వారా మోసపోవద్దని అంటాడు. మన ఎన్నో నమ్మకాలు పక్కన పడేయండి అంటాడు. గ్రహణాలు సైన్స్ ప్రకారం చూడండి .   పాత కాలపు మూఢ నమ్మకాలు  తీసి పక్కన పెట్టండి -అంటాడు.అన్నింటినీ హేతుబద్ధంగా చూడండి -అంటాడు. 

వీటిల్లో చాలా విషయాలు నేనూ యధాతథంగా ఒప్పుకుంటాను. నేను చాలా కాలంగా చెన్నైలో ఉండటం వలన, తమిళనాడులో  నేను చూస్తున్న హేతువాదం, ప్రపంచంలో మరెక్కడా  లేనన్ని   మూర్ఖపు నమ్మకాలతో కూడుకున్నది, రకరకాల ద్వేషాలతో, వైరుధ్యాలతో కూడుకొన్నది - అని నాకు బాగా అర్థమయింది. కానీ బాబు గోగినేని గారి హేతు వాదం నిజాయితీ తో కూడుకొన్నది; నిజంగా హేతువాదంగా, హిత వాదంగా వుండాలని ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు మనకు బాగా తెలుస్తుంది.

*  *  *  యింకా వుంది   *  *  *
 .


18, ఏప్రిల్ 2017, మంగళవారం

భగవద్ గీత (18) - సాంఖ్య యోగము - 2.36,2.37- విజయమో,వీరస్వర్గమో రెండూ గొప్పే; వెనుతిరిగిపోవడం మాత్రమే అకీర్తికరం


 

భగవద్ గీత (18)


  

 రెండవ అధ్యాయము   

 సాంఖ్య యోగము 

 భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి నాలుగు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం


అయిదు నుండి పదినాలుగవ వ్యాసం వరకు, శ్రీకృష్ణుడి వుపదేశంలో - దేహి(అంటే ఆత్మ), దేహాల మధ్య గల సంబంధము, తారతమ్యము, వాటి స్వరూప లక్షణాలు, సంబంధాలు  చూస్తూ వచ్చాము.

15,16 వ్యాసాలలో స్వధర్మము,  క్షత్రియ ధర్మము అయిన   ధర్మయుద్ధాన్ని చెయ్యడమే అర్జునుడి కర్తవ్యమని అన్నాడు శ్రీకృష్ణుడు.  ధర్మయుద్ధం చెయ్యకపోతే నీ ధర్మాన్ని విడిచిపెట్టి, పాపం చేసినవాడవౌతావు. " అన్నాడు. 


17 వ వ్యాసంలో, "సకల ప్రజలు నీ యీ  అకీర్తికరమైన పనిని, అవమానాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోగలరు. ఈ అకీర్తి, అవమానము  చావుకంటే  హీనమైనది. ఇక్కడున్న మహారథులందరు నీవు,  ఈ యుద్ధం నుండి, భయం చేత పారిపోయిన వాడవనే అనుకొందురు. ఇంతవరకు నిన్ను చాలా గొప్పగా అనుకొన్న వీరు నిన్ను యికమీద చాలా తేలికగా తీసుకొందురు." అన్నాడు శ్రీకృష్ణుడు. ఇంకా, యింకా ఏమంటున్నాడో , యిప్పుడు చూద్దాం.


 శ్రీకృష్ణుడి మాట :


"అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవాహితాః  
 నిన్దన్తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం  ను కిమ్ ||  (2. 36)


అవాచ్య   = మాట్లాడకూడని  ; వాదాన్   = మాటలు  ;   = కూడా  బహూన్   చాలా  ; వదిష్యన్తి మాట్లాడుతారు ; తవ    నీ యొక్క ; అహితాః  కీడుకోరేవారు, శతృవులు ; నిందంతః = హీనంగా మాట్లాడుతారు ; తవ  = నీ యొక్క ; సామర్థ్యం సామర్థ్యాన్ని, గొప్పదనాన్ని ; తతః    =  దీని  కంటే  ;  దుఃఖతరం = ఎక్కువ దుఃఖాన్నిచ్చేది ; ను = నిజంగా ; కిమ్ = ఏది వుంది ? 

 
"నీ శత్రువులు  నీ బల పరాక్రమాల గురించి, సామర్థ్యాన్ని గురించి   చాలా హీనంగా  మాట్లాడుతారు. వీరుడైన నీకు, దీనికంటే  దుఃఖాన్నిచ్చేది  మరొకటి వుందా? "


ఇప్పటి వరకు అర్జునుడి బల పరాక్రమాలు, యుద్ధ కౌశలము అందరికీ ఆశ్చర్యము గొల్పినదే.  ఎంతో గొప్ప వీరుడుగా అర్జునుడు ప్రఖ్యాతి గాంచిన వాడే. శివుడితో యుద్ధం చెయ్యడం, గంధర్వులతో యుద్ధంలో గెలవడం, ఉత్తరగోగ్రహణం లో కౌరవ వీరులందరిపైన, ఒంటరిగా పోరాడి గెలవడం - యివన్నీ అర్జునుడి సామర్థ్యాన్ని ప్రపంచమంతటా మారుమ్రోగ జేశాయి. 

కౌరవుల 11 అక్షౌహిణుల సేన, అందులోని వీరులు, అర్జునుడికేమీ భయం గొలిపే విషయాలు కాదు. నిజానికి, అర్జునుడి రౌద్రరూపమే, శత్రువులకు భయం కలిగించేది. అర్జునుడి ఎదుట నిలబడి యుద్ధం చెయ్యడం - చాలా మందికి పిరికితనం కలిగించే విషయం.

కానీ, అటువంటి అర్జునుడు, ఈ రోజు  యుద్ధం  నుండి, ఏ కారణం చేత  నైనా వెనుదిరిగితే, శత్రువులు ఏమనుకుంటారు? తన పరాక్రమాన్ని, ధైర్యాన్ని హీనంగా మాట్లాడరా, కించపరచరా? అది, అర్జునుడి లాంటి వీరుడికి తలవంపులు తెచ్చే విషయమే కదా. అంతకంటే ఒక వీరుడికి  దుఃఖ  కరమైన విషయం మరొకటి వుందా - అంటున్నాడు శ్రీకృష్ణుడు


వీరుడికి ధైర్యమే ఆభరణం, అలంకారం. పిరికితనాన్ని మించిన మరణం  వీరుడికి మరొకటి లేదు. ఈ దేశంలో అదే క్షత్రియులకు నూరి పోయబడిన స్వధర్మము, యుద్ధ ధర్మము. శత్రువు యొక్క  సంఖ్య, వారి బలం, తన బలం కంటే, ధైర్యం కంటే, తనకు యుద్ధం చెయ్యడంలో గల నేర్పు కంటే, గొప్పదనుకోవడమే, యుద్ధంలో అపజయానికి  కారణం అవుతుంది. మరణానికీ  కారణం అవుతుంది. యుద్ధం నుండీ పారిపోవడం, అన్నిటినీ మించిన అపఖ్యాతి తెస్తుంది. ఇదే చెబుతున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి, మనకూ కూడా. 

ఇప్పుడు, మీకు, ఈ మధ్య వచ్చిన గొప్ప తెలుగు సినిమా ఏదైనా జ్ఞాపకం వచ్చిందా ? అందులోని ఒక డైలాగ్ యిలాగే వుంది కదా? జయానికీ, అపజయానికీ మధ్య  వుండేది మన ధైర్యము, మన నమ్మకమూ. 

బాక్సింగ్  పోటీలలో మీరిది చూడొచ్చు. క్రింద పడిపోయిన వాడు ఓడిపోయినట్టు కాదు. క్రింద పడి, లేచి, మళ్ళీ బాక్సింగ్ చేసి, మళ్ళీ పడి, మళ్ళీ లేచి, ధైర్యాన్ని, నమ్మకాన్నీ విడువక, చివరికి గెలిచిన వాళ్ళు ఎంతో మంది వున్నారు. ఓటమి వొప్పుకుంటేనే, ఓడిపోయినట్టు. 

 ఈ విషయాన్ని, ఆంగ్ల సినిమా లు రాకీ 1,2,3,4 లలో చాలా బాగా చూపారు. శత్రువు మీకంటే పొడవుగా వుండొచ్చు, బలంగా ఉండొచ్చు కూడా. కానీ మీరు మీ పోరాటానికి యెంత బాగా సన్నాహాలు చేశారు, ఎంత మనో ధైర్యంతో వున్నారు, గెలిచి తీరాలన్న కాంక్ష మీలో ఎంత బలంగా వుంది - అన్నదే అంతిమ విజయానికి  ముఖ్యకారణం అన్నది చాలా బాగా చూపారు. 

రెండు కుక్కలు పోరాడుతూ ఉంటాయి. ఆ కుక్కల శరీరాల్లో వున్న బలాన్ని కంటే, వాటి మనసులలో వున్న బలమే, ఏది గెలుస్తుందన్నది నిర్ణయిస్తుంది. ఏనుగు వోడిపోవడానికి, సింహం గెలవడానికి  సింహం యొక్క మనో బలమే కదా ముఖ్య కారణం, అడవిదున్న సింహం చేతిలో సాధారణంగా చచ్చిపోతుంది. కానీ, ఎదిరించి నిలబడితే, సింహాన్ని ఘోరంగా, సులభంగా  చంపేస్తుంది. 

ఓటమి వొప్పుకోని వాళ్ళు, చివరి వరకు పోరాడే వారు, చివరికి  గెలిచే అవకాశాలు పూర్తిగా వుంది. కేవలం బాక్సింగ్ పోటీలే కాదు. కేవలం యుద్ధాలే కాదు. జీవితం లో, ఏ  ముఖ్యమైన లక్ష్య సాధనలో నైనా సరే. మీ ఆరోగ్యమైనా సరే ; మీ వృత్తిలో, వుద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఏ లక్ష్యం లో నైనా సరే, మీరు  ముందుకు పోవడం లో, విజయం సాధించడంలో - మీ ధైర్యానికి, చివరి వరకు ఓటమిని ఒప్పుకోని మీ నిలకడకు, స్థైర్యానికి  ప్రముఖ పాత్ర వుంటుంది. 

ఇంతే కాదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి యింకా ఎన్నో చెబుతున్నాడు. విందాం. 

శ్రీకృష్ణుడి మాట : 


 "హతోవా ప్రాప్స్యసి  స్వర్గం  జిత్వా వా భోక్ష్యసే  మహీం  
తస్మాదుత్తిష్ట  కౌంతేయ యుద్ధాయ  కృత నిశ్చయః || (2. 37హతః  చంపబడినట్లైతే వా   ఇదో, అదో (ఏదో ఒకటి); ప్రాప్స్యసి = నీవు పొందుతావు ; స్వర్గం    స్వర్గ లోకాన్ని ( ఆ సుఖాలను) ; జిత్వా గెలిస్తే  ; వా = ఇదో, అదో (ఏదో ఒకటి)  ;  భోక్ష్యసే అనుభవిస్తావు  ; మహీం = ఈ భూమిని  ; తస్మాద్   అందువలన   ; ఉత్తిష్ఠ (నీవు) నిలబడు ; కౌంతేయ = అర్జునా ; యుద్ధాయ  =  యుద్ధానికి  కృత నిశ్చయః  =  దృఢ నిశ్చయము తీసుకున్న వాడివై ; 


"అర్జునా! ఈ యుద్ధంలో నువ్వు గెలువ వచ్చు. లేదా, యుద్ధభూమిలోనే  మరణించవచ్చు. గెలిస్తే, రాజుగా ఈ భూమిపై ఆధిపత్యం వహించి భూలోకపు సుఖాలను అనుభవిస్తావు. అలా కాక, యుద్ధభూమిలో మరణిస్తే, స్వర్గలోకానికి  వెళ్లి స్వర్గ సుఖాలను అనుభవిస్తావు.  కాబట్టి, యుద్ధానికి సన్నద్ధుడై, కృత నిశ్చయుడై (అస్త్ర శాస్త్రాలను వహించి) నిలబడు. "  


యుద్ధం నుండి వెనుదిరిగిపోతే, ఎన్ని రకాల అవమానాలో విన్నావు కదా. కానీ, అలా పారిపోకుండా, యుద్ధం చేస్తే, నువ్వు గెలువ వచ్చు. గెలిస్తే, రాజుగా, ఈ భూలోక సుఖాలను అన్నిటినీ అనుభవించ వచ్చు. 

లేదా, యుద్ధభూమిలో పోరాడుతూ, నువ్వు వీరమరణం కూడా పొందవచ్చు. వీరమరణం పొందిన వారిని, స్వర్గం తన ద్వారాలు తెరిచి ఆహ్వానిస్తుంది. అప్పుడు నువ్వు స్వర్గలోకపు సుఖాలనన్నిటినీ అనుభవించగలవు. ఓడినా, గెలిచినా, నీకు కీర్తికరమే. ఆనందదాయకమే. కానీ, యుద్ధం విడిచి  తిరిగి వెళ్లడం అన్నిరకాల  అనర్థ దాయకం. 

కాబట్టి ఓ అర్జునా ! నీవు అస్త్ర శస్త్రాలను ధరించి యుద్ధానికి సన్నద్ధుడై నిలబడు ." అంటున్నాడు శ్రీకృష్ణుడు. నిజానికి, మనకందరికీ కూడా, ఇలాంటి ధర్మయుద్ధం  ఏదో ఒకటి ఉంనే వుంది. అధర్మం పలువిధాలుగా మన చుట్టూ నాట్యమాడుతూ వుంది. మనం దాన్ని వీరులులాగా ఎదుర్కొంటున్నామా, భయపడి  పారిపోతున్నామా - అన్న ఒక్క  అంశం పైనే మన యొక్క, మన దేశం యొక్క   పురోగతి, ప్రశాంతత ఆధారపడి వుంది. 

అధర్మాన్ని ఎదిరించే  అర్జునులు  యిప్పుడు కూడా మనకు కావాలి. మనమే అలా తయారు కావాలి. అవునా, కాదా? యోచించండి. భగవద్ గీత ఒక్క అర్జునుడి కథ మాత్రం కాదు. శ్రీకృష్ణుడు మనల్నందరినీ కూడా యిదే మాటలంటున్నాడు. యిదే  ప్రశ్న వేస్తున్నాడు.  

ధర్మం వైపు నిలబడి యుద్ధం చేస్తావా, భయపడి పారిపోతావా ? మీకూ, నాకూ కూడా యిదే ప్రశ్నయే.   


ఇంకా అర్జునుడు ఎలా ఉండాలో చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు ముందు వచ్చే శ్లోకాలలో. అవి మరో వ్యాసంలో చూద్దాం. 
వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ  జేస్తూ వుంటే చాలా బాగుంటుంది


సర్వే  జనాః సుఖినో భవంతు
  
= మీ   
    

ఉప్పలధడియం   విజయమోహన్ 
వజ్రాసనం